Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 14

Aswamedha Yaga-3.

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే |
సరయ్వాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోsభ్యవర్తత ||

తా||యజ్ఞాశ్వమును విడిచినపిమ్మట సంవత్సరకాలమునకు అది తిరిగివచ్చెను. అనంతరము సరయూనదికి ఉత్తరతీరమున రాజు యజ్ఞము ప్రారంభించెను.

బాలకాండ
పదునాల్గవ సర్గము
( దశరథుని అశ్వమేధయాగము )

యజ్ఞాశ్వమును విడిచినపిమ్మట సంవత్సరకాలమునకు అది తిరిగివచ్చెను. అనంతరము సరయూనదికి ఉత్తరతీరమున రాజు అశ్వమేధ యజ్ఞమును ప్రారంభించెను.

ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజుని గాచేసికొని ఆయన పర్యవేక్షణలో ద్విజోత్తములు మహాత్ముడైన దశరథుని అశ్వమేధయాగమునకు సంబంధించిన కార్యములను నిర్వర్తింపసాగిరి. వేదములందు ఆరితేరిన ఋత్విజులు యాజకులుగా విధియుక్తముగా శాస్త్రానుసారముగా యజ్ఞవిధులను ఆచరించుచుండిరి. ఆ ఋత్విజులందరు సంతోషముతో యథావిథిగా సమస్త దేవతలకూ పూజించిరి. పిమ్మట వారు ప్రాతస్సవన తరువాత కర్మలను అనుష్టించిరి. ఋత్విజులు శాస్త్రోక్తముగా ప్రవర్గ్య కర్మను అట్లే ఉప్పదము అనబడు ఇష్టి కార్యములను శాస్త్రోక్తముగా అనుసరించిరి. ఇంకను అధికమైన శాస్త్రమువలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి.

ఇంద్రునికి ఇవ్వవలసిన హవిస్సులు సమర్పింపబడినవి. సవన లతనుంచి సోమరసము తీయబడినది. పిమ్మట మాధ్యందినము ఆచరింపబడినది. అదే విధముగా ఆ బ్రాహణపుంగవులు దశరథుని తృతీయ సవనమును గూడా శాస్త్రోక్తముగా ఆచరించిరి.

అచట చేయబడని హోమము లేదు. ఒక హోమము మాఱుగా మరియోక హోమము చేయబడలేదు. హోమక్రియలో ఏమాత్రము దోషములు లేవు. హోమాదికము అంతయూ మంత్ర పూర్వకముగా నిర్విఘ్నముగా ఆచరింపబడినది . ఆ యజ్ఞములో అలసిపోయినవారుగాని ఆకలితో బాధపడినవారు గాని లేరు. విద్వాంసుడుగాని బ్రాహ్మణుడు లేడు. వందమంది శిష్యులు గాని అనుచరులు గాని లేని బ్రాహ్మణుడు లేడు.

ప్రతిదినము బ్రాహ్మణులు తదితర వర్ణములవారును తృప్తిగా భుజించుచుండిరి. తాపసికులు సన్యాసులు కూడా అచట ఆతిధ్యమును స్వీకరించుచుండిరి. వృద్ధులు , రోగగ్రస్త్లు , స్త్రీలు , బాలబాలికలు కూడా అచట భోజనము చేయుచుండిరి. వారందరూ ఏల్లప్పుడును భుజించుచున్నప్పటికీ తృప్తి పడనివారు లేరు.

"ఇవ్వండి " ఇవ్వండి" అను మాటలు మారుమోగుతూఉండగా అందరికి అన్నము వస్త్రములు ఒసగుచుండిరి. ప్రతిదినము శాస్త్రోక్తముగా సిద్ధపరచబడిన అన్నరాసులు పర్వత ప్రమాణముగా కనపట్టుచుండెను. నానాదేశములనుంచి అనేకమంది స్త్రీలు పురుషులు విచ్చేసిరి. వారందరికీ అన్నపానీయములను ఏర్పాటుచేసితిరి. ఆ బ్రాహ్మణోత్తములు విధియుక్తముగా చేయబడిన భక్ష్యాన్నములను గురించి ప్రశంసించుచూ, " అహో తృప్తిచెందినవారము , మీకు శుభమగుగాక " అన్నమాటలను దశరథుడు వినెను. చక్కగా వస్త్రాభరణములను ధరించిన పురుషులు బ్రాహ్మణులు వడ్డించుచుండిరి.ప్రకాశించుచున్న మణికుండలములను దాల్చిన మఱికొందరు అతిధి సేవలలో సహాయపడుచుంటిరి.

కార్యముల మధ్య విరామ సమయములో వాక్చతురులు ప్రజ్ఞాశీలురైన బ్రాహ్మణులు ఒకరినొకరు జయింపవలెనను కోరికతో హేతుబద్ధములైన అనేక చర్చలను గావించుచుండిరి.

ఆ యజ్ఞమునందు ప్రతిదినము సమర్థులైన బ్రాహ్మణులు సవనత్రయాది సర్వకర్మములనూ శాస్త్రయుక్తముగా ఆచరించుచుండిరి. ఆ బ్రాహ్మణ సముదాయములో షడ్ వేదాంగములు తెలియని వారుకాని, వ్రతనిష్ఠ లేని వారు గాని, శాస్త్రములు వినని వాఱుగాని , శాస్త్ర చర్చలలో పాఱంగతులు కాని వారు గాని లేరు.

ఆ యజ్ఞములో యూపస్తంభముల స్థాపన సమయము రాగా ఆఱు మాఱేడు యూపస్తంభములు, చంద్ర స్తంభములు , అదే విధముగా ఆఱు మోదుగ స్తంభములు పిదప శ్లేషాత్మకమనబడు వృక్షస్తంభము ఒకటి దేవదారు వృక్షస్తంభములు రెండు నిలబెట్టబడినవి . ప్రతి రెండు యూప స్తంభముల మధ్య సమానమైన దూరముండెను. ఈ యూపస్తంభములన్నియు యజ్ఞకోవిదుల పర్యవేక్షణలో శోభలను ఇనుమడించుటకు బంగారు తోడుగులతో అలంకరింపబడినవి. నిలపబడిన ఇరువది ఒకటి యూపస్తంభములు ఇరువదియొక్క మూరలపోడవు గలవు. ప్రతిస్తంభము వేఱు వేఱుగా వస్త్రములతో అలంకరించిరి. శిల్పకారులచే నిర్మింపబడిన ఆ యూపస్తంభములన్నియూ సమానముగా దృఢముగా ఎనిమిది ముఖములతో చూడముచ్చటిగా చేయబడినవి. అవి శాస్త్రోక్తముగా చేయబడినవి. వస్త్రములచే కప్పబడి , పూలు మరియు గంధములతో అలంకరింపబడి ఆకాశమున సప్త ఋషులవలే దేదీప్యమానముగా విరాజిల్లు చున్నవి.

ఆ యజ్ఞవేదిక కట్టుటకు కావలసిన ఇటికలు శాస్త్రానుసారముగా తయారుచేయబడినవి. ఆ యజ్ఞవేదిక కూడా అనుభవజ్ఞులైన బ్రాహ్మణులద్వారా శాస్త్రానుసారముగా నిర్మింపబడినది. రాజసింహుడగు దశరధునిచే పూజింప బడవలసిన అగ్నివేదిక యందున్న అగ్ని ఒక గరుడాకారము గలిగి స్వర్ణమయమైన రెక్కలతో, మూడింతలై పదునెనిమిది వరుసలు కలిగిఉండెను.

అచట శాస్త్రప్రకారముగా అయా దేవతలనుద్దేశించి పశువులు పాములు పక్షులు అయా స్తంభములకు కట్టివేయబడినవి. అచట యజ్ఞకర్మలకోసము తీసుకురాబడిన హయములు జలములో చరించే జలజంతువులు ఆన్నిటినీ ఋత్విజులు శాస్త్రానుసారముగా నియుక్తించబడినవి. అ స్తంభములకు మూడువందలకు పైగా పశువులు బంధింపబడినవి. అచట దశరథుని యొక్క అశ్వరత్నములు కూడా గలవు.

కౌసల్యాదేవి అతి సంతోషముతో ఆ యజ్ఞాశ్వమునకు పరిచర్యలు సలిపి ఖడ్గముతో మూడు గుర్తులు పెట్టెను. కౌసల్యాదేవి ధర్మసిద్ధికొఱకు స్థిరమైన చిత్తముతో అశ్వసమీపమున ఒక రాత్రి నివశించెను.

ఋత్విజులైన హోతా అధ్వర్యు మరియు ఉద్గాతా మహీషి వావాత పరివృత్య ముగ్గురి చేతి తో ఆ యజ్ఞాశ్వమును తాకించిరి. జితేంద్రియుడు ప్రయోగములలో కుశలుడైన ఒక ఋత్విజుడు పతత్రిణమును గైకొని శాస్త్ర ప్రకారముగా వండెను. దశరథమహారాజు తన పాపములను తొలగించికొనుటకు యథావిధిగా శాస్త్రప్రకారము ఆ ధూమగంధమును వాసన చూచెను.

బ్రాహ్మణోత్తములైన పదునాఱుమంది ఋత్విజులు ఆ అశ్వమేథయాగమునకు సమకూర్పబడిన హవ్య ద్రవ్యములను మంత్రములు పఠించుచూ అగ్నిలో సమర్పించిరి. అశ్వమేధయజ్ఞములో హవిస్సులను వైతసము అను చెట్లపై సంస్కరించెదరు. ఇతర యజ్ఞములలో ప్లక్ష వృక్షములోన ఉంచి శుద్ధి చేసెదరు. వేదభాగములైన బ్రాహ్మణముల లోని కల్పసూత్రములను అనుసరించి యజ్ఞము మూడిదినములలో నిర్వర్తింపవలసినది. మొదటిదినమున చేయబడు కార్యక్రమము చతుష్టొమమనబడును. రెండవదినమున చేయబడు కార్యక్రమము ఉక్థ్యము అనబడును. మూడవదినమున ఆచరింపబడు కార్యక్రమమును అతిరాత్రమనబడును.

శాస్త్రములలో చెప్పబడిన ఇతర క్రతువులను ఎన్నో దశరథ మహారాజు నిర్వర్తించెను. శాస్త్రోక్తముగా జ్యోతిస్టోమము , ఆయుర్యాగము, రెండు అతిరాత్రములను , అభిజిత్ , విస్వజిత్ , ఆప్తోర్యామమనబడు యాగములను దశరథమహారాజు ఆచరించెను.

స్వకులవర్ధనుడగు ఆ మహారాజు హోత అను ఋత్విజునకు తూర్పుదిశనున్నభూమిని, అధ్వర్యు అను ఋత్విజునకు పడమరనున్న భూమిని, బ్రహ్మస్థానమున ఉన్న ఋత్విజునకు దక్షిణదిశయందున్న భూమిని , ఉద్గాతా అను ఋత్విజునకు ఉత్తరదిశయందున్న భూమిని దక్షిణలు గా ఇచ్చెను. ఈ విధులను స్వయంభూవు అయిన బ్రహ్మ తెలిపిఉండెను. దశరథమహారాజు క్రతువు ముగిసినపిమ్మట శాస్త్ర ప్రకారము క్రతుఫలాభివృద్ధికై ఈ విధముగా ఋత్విజులకు భూమిని దానముగా ఒసంగెను.

ఈవిధముగా సమస్తము దానము చేసిన పిమ్మట ఆ ఇక్ష్వాకు మహారాజు మహదానందముపొందెను.

అంతట ఆ ఋత్విజులందరూ యజ్ఞముద్వారా పవిత్రుడైన ఆ రాజుతో " ఈ సమస్త భూమండలము పరిరక్షించుటకు నీవే సమర్థుడవు. మాకు భూమితో పనిలేదు.దానిని పండించుటలోగాని రక్షించుటలోగాని మేము అశక్తులము. నిత్యము నిరంతరము వేదాధ్యయమునందే నిరతులము.. ఓ రాజా ! ఈ భూదానములకు మాఱుగా కొంత ధనము మీరే ఇప్పించుడు. ఓ రాజా శ్రేష్ఠములైన మణులను గాని బంగారముగాని గోవులనుగాని లేక సిద్ధముగానున్న ఏ వస్తువులనైననూ మాకు దయచేయుము. భూమివలన మాకు ప్రయోజనము లేదు " అని పలికిరి.

వేదవేత్తులైన ఆ బ్రాహ్మణులు అట్లు పలకగా మహారాజు వారికి పదిలక్షల గోవులను , పది కొట్ల బంగారు నాణేములను , దానికి నాలుగు రెట్లు వెండి నాణేములను ఒసగెను.ఆప్పుడు ఆ బ్రాహ్మణూలందరూ కలిసి తమకు లభించిన దక్షిణలను ధీశాలురైన వసిష్ఠునకు ఋష్యశృంగ మహర్షి కి సమర్పించిరి. అప్పుడు ఆ ఇరువురును ఆ దక్షిణలను ఋత్విజులకు యథోచితముగా పంచిఇచ్చిరి. అప్పుడా బ్రాహ్మణోత్తములందరూ ప్రసన్నచిత్తులై " మేము ఎంతో సంతుష్టులమైతిమి" అని పలికిరి

పిమ్మట యాగము చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మెలైన కొటి బంగారు నాణెములను మహారాజు శ్రద్ధాదరములతో ఒసగెను. ఈవిధముగా కోశాగారములోని ద్రవ్యములను ఆన్నిటినీ దానము చేసినపిమ్మట ఒక బ్రాహ్మణుడు అచటికి విచ్చేయగా ఆ రాఘవనందనుడు ఆయనకు తన ముంజేటి కంకణమును దానము చేసెను. ఆ విధముగా సమృద్ధిగా దక్షిణలు లభింపగా బ్రాహ్మణులు మిక్కిలి సంతృప్తి చెందిరి.ఆద్విజవత్సలుడగు రాజుకూడా అనంద భాష్పములు రాల్చుచూ వారికి నమస్కరించెను. అప్పుడు భూమిపై సాగిలపడి నమస్కరించుచున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధముగా వేదమంత్రములతో ఆశీర్వదించిరి.

పాపములను నాశనము చేయుదియు , పుత్రలాభముద్వారా స్వర్గము ప్రాప్తింపచేయునదియూ, సామాన్యులైన రాజులకు ఆసాధ్యమైనదియూ అగు ఆ అశ్వమేధ యాగము చేసి ఆ దశరథమహారాజు మిక్కిలి సంతుష్టుడాయెను.అప్పుడు దశరథమహారాజు ఋష్యశృంగ మహర్షి తో ఇట్లు పలికెను. " ఓ తపోధనా వంశాభివృద్ధినిగూర్చు పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువును నిర్వహించుటకు మీరే సమర్థులు " అని ఆ క్రతువుని నిర్వహించుటకు మరల అభ్యర్ధించెను.

" అటులనే" అని అందులకు సమ్మతించి ఋష్యశ్రుంగుడు ఇట్లు పలికెను. " రాజా నీకు వంశోద్ధారకులైన నలుగురు పుత్రులు కలుగుదురు " అని. ఋష్యశృంగుడు పలికిన ఆ మధురవచనములను విని , మహరాజు ప్రశాంతచిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను. పుత్త్రప్రాప్తికై క్రతు నిర్వహణమునకు ఆ తపశ్విని మరల అభ్యర్థించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే చతుర్దశస్సర్గః ||
సమాప్తం ||

సతస్య వాక్యం మథురం నిశమ్య
ప్రణమ్య తస్మై ప్రయతో నృపేంద్ర |
జగామహర్షం పరమం మహాత్మా
తం ఋష్యశ్రుంగం పునరప్యువాచ ||

తా|| ఋష్యశృంగుడు పలికిన ఆ మధురవచనములను విని , మహరాజు ప్రశాంతచిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను. పుత్త్రప్రాప్తికై క్రతు నిర్వహణమునకు ఆ తపశ్విని మరల అభ్యర్థించెను.

||ఓమ్ తత్ సత్||



|| om tat sat ||